Sunday 6 December 2015

కడపటి పిడక


||కడపటి పిడక ||
వేలికొసల వేదనలు
నీ స్పర్శలు ఇక ఉండవని
ప్రాణాన్ని పెకలిస్తున్న నిశ్శబ్దం
అగాథ అరణ్యాల్లోకి నన్ను విసిరేసింది
ఫట్మని పేలిన కన్నీటిబుగ్గ చప్పుడుకి
ఉబికి ఉబికి వస్తున్న మౌనం బద్దలైంది
శూన్యపాతాల సుళ్ళులో చిక్కిన నా నీడని
అశ్రువులే ఓదార్పై తడిమాయి
శిథిలమైన నీ దేహన్ని
పదిలంగా నా ఙ్ఞాపకాల్లో బతికించుకోవడానికి ప్రయాసలు పడుతున్నాను బేలగా
జవం లేని జీవమేగా నేనిపుడు
నీ జాడలు ఇక ఉండవని గుర్తొస్తున్న ప్రతీసారి
నా మనసుకి మస్తిష్కానికి మధ్య
దారం తెగిపోతూనే ఉంది
ఆఖరి చూపు కడపటి పిడకతో ఆగిపోయింది
ఇప్పుడు గడ్డకట్టిన గుండె తప్ప
నా దగ్గర ఏమి లేదు
మనసుపై రోదన తేమను అద్దెందుకు
నాకొక స్పర్శ కావాలి
చితి రేపిన కొన్ని సెగలకు
నాకొక మంచు లేపనం కావాలి
నిజమైన మరణమంటే
మన నీడ తెగడం కాదు
అంతవరకు మనల్ని నిరంతరం తాకే
కొన్ని స్పర్శల్ని కోల్పోవడమే
అసలైన మరణం
ఇపుడు నీ చితిని నింపుకున్న
మట్టికుండని అవ్వాలనుంది

24/10/15

No comments:

Post a Comment