Sunday 6 December 2015

పేదకవి







||పేదకవి||
భారమైన పాదాల్ని చేతుల్లోకి తీసుకొని సాగిపోతుంటా
దారి పొడవున వేల ధాతువుల్ని ఏరుకుంటూ బాటసారి అవ్వాలని
జారిపోయే కాలాన్ని రెప్పల మధ్య బంధించేందుకు ప్రయత్నిస్తూ ఓడిపోతుంటా
కొన్ని భావాలకు పురుడుపోసే పనికి పూనుకుంటూ
అక్కడ గర్భంలో ఉమ్మనీటికి, నుదుటిపై కారే చెమట చుక్కకి భేదం లేదు
రాలిపోయే ఆకుల్లో
వాడిపోయే పువ్వుల్లో
చీమలదండుల్లో
నత్తల గుల్లలో
గొంగళి నడకల్లో
గుళక రాళ్ళల్లో
కవిత్వాన్ని వెర్రిగా వెతికేస్తుంటా
శూన్యం నుండి వచ్చే కొన్ని నిరాశలు నను చుట్టుముట్టి వెర్రివాడ్ని చేశాయి మరి
నిరాశలో కూరుకుపోయి కుప్పకూలిన నన్ను
నాచుపడ్డ ఓ గట్టు ఆధారమై ఆదుకుంది
ఆ నాచుని పరుచుకున్న గట్టులో కూడా కవిత్వం ఉంటుందని తెలుసుకోలేకపోయా
హహహ నేను వెర్రివాడ్నే కద
దూరాన విర్రవీగే సూర్యుడికి తెలుసో లేదో
ఎడారి ఇసుక రేణువు మండే గుణం
ఆకసాన తేలే మబ్బుకి తెలుసో లేదో
ఎండిన నీటి ప్రసవ వేదనపు ఆర్తనాదం
ఇంతకీ నా పయనానికి తెలుసో లేదో
నా అడుగులకు అంటుకున్న మట్టిలో కూడా కవిత్వం ఉంటుందని
బహుశా ఆఖరి శ్వాసలో తెలుసుకుంటానేమో
కాగితమే ఓ కవిత్వమని

8/7/15

No comments:

Post a Comment