Sunday 6 December 2015

సంద్రం




||సంద్రం॥
సంద్రం ముందు ఉంటే
నే చిన్నపిల్లాడ్ని అయినట్టే
సంద్రం అంటే ఏంటి
నేలపై ఉన్న నింగే కద
ఆ నింగిని ఈ నేలపై అందుకున్న క్షణాలు
నాకెప్పుడు ఆనందపు అణువులు వెల్లివిరిసినట్టే
ఆకాశానికి మబ్బులు వేలాడినట్టు
సముద్రానికి నావలు వేలాడుతుంటాయి
మబ్బుల వలె పడవల కదలికలు
నాలో రేపెను ఎన్నో కవనాలు
ఒక్కో క్షణం అనిపిస్తుంది
నీ తీరంలో రాయిని అవ్వాలని
నిరంతరం తనలో తడిసి మురిసిపోవాలని
మా మధ్య కూడా కొన్ని వైరాలు
తీరాలతొ తియ్యని తగాథాలు
ఇసుకల్లో నా గురుతులు లేనపుడల్లా
గాలి కూడా నాపై వాలిపోతూ
ఏవేవో మాటలు నిశ్శబ్దంగా పలుకుతుంటుంది
మేం సరదాగా మాట్లాడుకుంటున్నపుడు అడిగాను
నీలో ఈ ఉప్పటి హృదయం ఎందుకని?
నీ కన్నీటిని మింగి
నీలో నా ఆనందాన్ని పొందడం కోసమే
అన్న మాటలు విన్నపుడు
మా బంధం ఇంకా పెరిగింది
ఏదో అందం మమ్మల్ని అలుముకుంది
నింగి రంగును ఒళ్ళంతా పూసేసుకొని ఉంటుంది
తీరా తనతో ప్రయాణించినపుడు వర్ణం మాయమవుతుంది
అవాక్కయ్యి చూస్తుండగా
తన వర్ణాన్ని నా మనస్సుకు అలికేసి వెళ్ళిపోతుంది
ఇంకొంత రంగు తీసుకురావడానికి...

3/5/15

No comments:

Post a Comment