Sunday 6 December 2015

చెట్టు చాటు జీవితం




|| చెట్టు చాటు జీవితం ||
అంధకారపు అందాలను బజారున పరుచుకొని
చెట్టు చాటున చితికిపోయే జీవితాలను
ముఖాల్లో మోసే నవ్వులో జొప్పేసుకుంటూ
ఊరిలో బిడ్డ కోసం
ఊరి చివర అడ్డంగా బలైపోతుంటారు
ఆకలి ఆక్రందనల అలసటలో ఆటబొమ్మగా
తీగకు వేళాడుతూ
కామకళ్ళ కొరికివేతల్లో ముక్కలైపోతున్న శరీరాన్నీ ఏరుకుంటూ చీకటికి అంకితమౌతారు
నడిరేయి నొప్పిని పంటి బిగువున దాచుకొని
అశ్రురోదనల మధ్య అస్తమిస్తూ రాత్రిలో
ఉదయిస్తారు
ఈగతనపు మగమృగాల కింద
మాంసపు ముద్దలై నలిగిపొతూ
బానిసత్వపు బిరుదులు పొందుతారు
చీర మాటున కార్చే అవయవకన్నీళ్ళకు
పరిమళపు పౌడర్ అద్దుకుని
అద్దెకు సిద్దమవుతారు
గమ్యం లేని గమనాల్లో
గతుకుల బతుకులకు అత్తరు అతుకులు
అతుక్కుంటూ
బాధలను మింగి భంగిమలకు లొంగి
బ్రతుకు భారాన్ని దేహల సాక్షిగా మోస్తూ
కన్నీటి జడిలో ఈదుతూ మగ్గిపోతారు
వాళ్ళను చీకట్లో మాత్రమే గుర్తించే లోకమా
రెండు కన్నీటి చుక్కలైనా రాల్చి నీ మానవత్వానికి ఉన్న మసిని కడిగేసుకో

19/7/15

No comments:

Post a Comment